రివ్యూ : ఎన్టీఆర్-కథానాయకుడు
చిత్రం : ఎన్టీఆర్-కథానాయకుడు
నటీనటులు : బాలకృష్ణ, విద్యాబాలన్, రానా, సుమంత్, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్, పూనమ్ బాజ్వా, మంజిమా మోహన్, నరేష్, మురళీశర్మ, క్రిష్, రవికిషన్, శుభలేఖ సుధాకర్, రవిప్రకాష్, చంద్ర సిద్ధార్థ, భానుచందర్, ప్రకాష్‌రాజ్, కె.ప్రకాష్, ఎన్.శంకర్, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
వెండితెరపై జానపద, పౌరాణిక, సాంఘిక… ఇలా జోనర్ ఏదైనా తనదైన నటనతో చెరగని ముద్రవేసిన గొప్ప నటుడు ఎన్టీఆర్. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేజీలు సువర్ణాక్షరాలతో లిఖించదగనవి. సినీ ప్రస్థానంలో ఎలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్య మంత్రి స్థాయికి ఎదిగిన తీరును ఎవరూ మర్చిపోలేరు. మరి అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే ఇది. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్లో నటించిన యన్.టి.ఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది ? ఎన్టీఆర్‌గా బాలకృష్ణ ఎలా మెప్పించారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఎలా సాగింది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
ఎన్టీఆర్ (బాలకృష్ణ)కు సినిమాలపై వ్యామోహం ఎందుకు పెరిగింది ? సినిమాల్లో ఎలా రాణించాడు ? ఒక సాధారణ రైతు బిడ్డ గొప్ప స్టార్‌గా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్లాడన్నది కథ . ఎన్టీఆర్ ప్రస్థానంతో మొదలైన చిత్రం.. ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రకటనతో ముగుస్తుంది. ఎన్టీఆర్ సినీ నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఐతే, ఆయన కుటుంబానికి ఎంత విలువ ఇస్తారు. ముఖ్యంగా బసవతారకమ్మకు ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తారన్నది ఎవరికీ తెలియదు. ఆ విశేషాలన్నీ యన్.టి.ఆర్: కథానాయకుడులో చూస్తాం.
ప్లస్ పాయింట్స్ :
* ఎన్టీఆర్-బసవతారకం సన్నివేశాలు
* ఎన్టీఆర్-ఏయన్నార్ల మైత్రి
* సంభాషణలు
* భావోద్వేగ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
* నిడివి ఎక్కువగా ఉండటం
* యంగ్ ఎన్టీఆర్ గా బాలయ్యకు మేకప్
ఎలా సాగింది ?
ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాలనుకుంటున్నారో.. ఏం తెలుసుకోవాలనుకుంటారో.. అవన్నీ తెరపై చూపించాడు దర్శకుడు. ఎన్టీఆర్ సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన పోషించిన పాత్రలన్నీ ప్రతి ఐదు నిమిషాలకోసారి మనకు దర్శనమిస్తాయి. అదంతా పండగలా ఉంటుంది. ఆయా పాత్రల్లో బాలకృష్ణ అభిమానులను అలరిస్తారు.
దర్శకుడు ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలపై ఎక్కువ దృష్టిపెట్టాడు. ఎన్టీఆర్-బసవతారకం మధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చర్యపోతారు. ఒక భర్త.. భార్యకు ఇంతలా ప్రాధాన్యం ఇస్తారా ? అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్రతి మలుపు కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.
మనదేశం, రైతుబిడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్‌కు ఎలా అవకాశం వచ్చింది? తోటరాముడి పాత్ర ఎలా దక్కింది. కృష్ణుడిగా ఎన్టీఆర్ కనిపించినప్పుడు ఎదురైన సంఘటనలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి.
ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎందుకు రావాలని అనుకుంటున్నాడు.. అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి? కథానాయకుడి జీవితం నుంచి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదగాలనుకున్నాడది ప్రీక్లైమాక్స్‌లో కనిపిస్తుంది. దివిసీమ ఉప్పెన నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు, గుండెలను మెలి తిప్పేలా చూపించాడు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే ?
ఎన్టీఆర్‌గా బాలకృష్ణ.. ఎన్నో విభిన్న గెటప్పుల్లో కనిపించారు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి పాత్రల్లో బాలకృష్ణని చూడటం అభిమానులకు నిజంగా పండగలా ఉంటుంది. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న సమయంలో బాలకృష్ణ కనిపించిన సన్నివేశాలు అంతగా అతకలేదేమో అనిపిస్తుంది.
బసవతారకంగా విద్యాబాలన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవడమే ఈ సినిమాకు ప్రధాన బలం. ఎందుకంటే ఇది బసవతారకం కథ కాబట్టి. ఈ పాత్ర తర్వాత అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునేది అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. అక్కినేనిగా సుమంత్ చాలా చక్కగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఏయన్నారేమోననిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్టీఆర్-ఏయన్నార్ల అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్కరించారు. పేరున్న నటీనటులందరూ చిన్న చిన్న పాత్రల్లో మెరిసి, ఆ పాత్రల విశిష్టతను పెంచారు.
సాంకేతికంగా :
ఎం.ఎం. కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు బాగున్నాయి. ప్రతి సన్నివేశంలో ఒక మెరుపులాంటి సంభాషణ ఉంటుంది.
రేటింగ్ : 3/5