తెలంగాణ ఫలితాలపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే పేరుతో హడావుడి చేశారు. తెలంగాణలో ఊహించని విధంగా స్వతంత్య్ర అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. మహాకూటమి ఘన విజయం సాధించబోతుందని తెలిపారు. ఐతే, అందుకు భిన్నంగా ఫలితాలొచ్చాయ్. టీఆర్ఎస్ ఘన విజయం సాధించి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి పత్తాలేకుండా పోయారు. దాదాపు అజ్ఝాతవాసంలోకి వెళ్లిపోయినట్టు వ్యవహరించారు. ఆ మధ్య కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినా.. మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత బుధవారం లగడపాటి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ ఫలితాలపై సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘మొదటి సారి తన సర్వే ఫలితాలు తారుమారయ్యాయి. 2003 నుంచి అనేక రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో సర్వేలు చేశా. పార్టీలు, మీడియాతో సర్వే వివరాలు పంచుకున్నాను. ఎప్పుడూ సర్వే వివరాల్లో పెద్దగా తేడా రాలేదు. మేం చేసిన సర్వే ఫలితాలు మొదటిసారి తారుమారయ్యాయి. పోలింగ్ శాతం వివరాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. ఆ వివరాలు చెప్పడానికి ఈసీకి ఒకటిన్నర రోజులు పట్టింది. ఎలక్ట్రానిక్ యుగంలో ఇంత సమయం ఎందుకు పట్టింది. కచ్చితంగా ఏదో జరిగింది. తనకి కలిగిన అనుమానాలని నివృత్తి చేసుకొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తా’నన్నారు.
‘గత కొన్ని రోజులుగా నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందిచాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చా. ఎవరి ప్రలోభాలకు నేను లొంగే వ్యక్తిని కాదు. స్వతంత్ర వ్యక్తిని. చెప్పిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకున్నా. ఎంతో మంది ఒత్తిడి చేసినా మళ్లీ రాజకీయాల్లోకి రాలేదు. పోలింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీలకు అనేక అనుమానాలు ఉన్నాయి. నా సర్వే తప్పయితే తప్పని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా వల్ల ఎక్కడైనా తప్పు జరిగితే క్షమాపణ చెబుతా. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు సర్వే వివరాలు చెప్పను. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే చెబుతా’నన్నారు లగడపాటి