మెరుపుదాడులు చేశారు ఇలా.. !

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఎల్‌ఓసీని దాటి భారత వాయుసేన పాక్‌ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది. భారత్‌కు చెందిన మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు మంగళవారం తెల్లవారుజామున నియంత్రణ రేఖను దాటి ఉగ్ర క్యాంపులపై దాడి చేశాయి. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భారత వాయుసేన ఈ దాడులను జరిపింది. దాదాపు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను ఉగ్ర శిబిరాలపై జారవిడిచింది. ఈ దాడుల్లో 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారని భావిస్తున్నారు.

* మంగళవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు మొదటి దాడి ప్రారంభమైంది.

* పీఓకే రాజధాని‌ అయిన ముజఫరాబాద్‌కు 24 కిమీ దూరంలో బాలకోట్‌ ప్రాంతంపై 3.45 నుంచి 3.53 వరకూ బాంబుల వర్షం కురిపించింది. బాలకోట్‌ పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ప్రాంతం.

* బాలాకోట్‌లోని జైషే మహమ్మద్‌, లష్కరే, హిజ్బుల్‌ ఉగ్రవాద సంస్థల సంయక్త శిక్షణా శిబిరాల లక్ష్యంగా భారత్‌ ఈ దాడులు చేపట్టింది.

* మరో లక్ష్యం ముజఫరాబాద్‌ ప్రాంతంపై యుద్ధ విమానాలు 3.48 నిమిషాల నుంచి 3.55 మధ్య దాడులు చేపట్టాయి.

* చకోటి ప్రాంతంపై 3.58 నుంచి 4.04 వరకూ జెట్‌ ఫైటర్స్‌ బాంబుల వర్షం కురిపించాయి.