రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్

టీడీపీలో సీనియర్ నేతలు ఈసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. తమకి బదులుగా తమ వారసులకి టికెట్స్ ఇప్పించుకొంటున్నారు. ఈ లిస్టులో మంత్రి పరిటాల సునీత కూడా చేరిపోయారు. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం రాప్తాడు నుంచి తెదేపా అభ్యర్థిగా తన తనయుడు శ్రీరామ్‌ను బరిలోకి దించాలని నిర్ణయించామని మంత్రి సునీత తెలిపారు.

తమ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలని అధినేత చంద్రబాబును కోరామని.. వీలుకాకపోతే రాప్తాడు నుంచి శ్రీరామ్‌ బరిలో ఉంటారని సునీత స్పష్టం చేశారు. గురువారం చంద్రబాబును కలిసి తమ నిర్ణయాన్ని చెబుతామన్నారు. గత ఎన్నికల నుంచి పార్టీ వ్యవహారాల్లో పరిటాల శ్రీరామ్‌ క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మంత్రిగా తల్లి సునీత ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్న సమయాల్లో కార్యకర్తలకు, నేతలకు ఆయన అందుబాటులో ఉంటూ వస్తున్నారు. మంత్రి లోకేష్ తోనూ శ్రీరామ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. లోకేష్ సూచనతోనే శ్రీరామ్ పోటీకి దిగతున్నట్టు విశ్వసనీయ సమాచారమ్.