స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన భాజాపా-వైకాపా బంధం !
టైమ్స్ నౌ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో భాజపా, వైకాపాల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం బయటపడింది. ‘మేం భాజపాతోనే ఉన్నాం. 100శాతం మా మధ్య అవగాహన ఉంది. ఈ విషయంలో మా నేత విజయసాయిరెడ్డి తన పనిని సమర్థంగా చేస్తున్నారు’ అని వైకాపా విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి అంగీకరించారు.
మేం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు మద్దతిచ్చాం. ఆ తర్వాత పలు నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించాం. భాజపా పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని కొఠారి వెల్లడించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు. పార్టీ విధానం కూడా.. జగన్ నేరుగా ఈ విషయం మాతో చెప్పరు. పెద్దిరెడ్డి లాంటి ఐదారుగురు నేతలు జగన్తో మాట్లాడతారు. వారే మాకు సమాచారం అందజేస్తారని కొఠారి చెప్పుకొచ్చారు.
ఈ స్టింగ్ ఆపరేషన్’తో భాజాపాతో వైకాపా రహస్య ఎన్నికల ఒప్పందం మాత్రమే బయటపడలేదు. భాజాపాతో టీఆర్ఎస్ కుమ్మక్కు కూడా బట్టబయలైంది. వైకాపా, టీఆర్ఎస్ ఉమ్మడిగా భాజాపాని సపోర్టు చేస్తున్నాయని అర్థమవుతోంది. అందుకే ఏపీలో వైకాపా గెలుపుని టీఆర్ఎస్ ఆకాంక్షిస్తోంది. అందుకు కృషి చేస్తోంది కూడా. ఐతే, ఇన్నాళ్లు భాజాపా, కాంగ్రెస్ పార్టీలు రెండు తమకు ఒకటే. రెండు ప్రత్యర్థి పార్టీలే అంటూ చెప్పుకొస్తున్న తెరాస, వైకాపా ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయన్నది చూడాలి.