ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని అడ్డుకొనేవాడే లేడు.. !
న్యాయం కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వైపే నిలిచింది. హైకోర్టులోనూ ఈ సినిమాకు ఊరట లభించింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలని ఆపలేమని కోర్టు తీర్పునిచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదలను అడ్డుకోవాలంటూ.. సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ ఇలాంటి సినిమాలు విడుదల చేయొద్దని, వీటి ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు.
తాజాగా, ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. దానిని కొట్టివేసింది. ప్రతివ్యక్తికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు సినిమా విడుదలను ఆపే అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు కోర్టు చిక్కులు తొలగినట్టయ్యింది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో సెన్సార్ చిక్కులు, ఎన్నికల కమిషన్ నుంచి అభ్యంతరాలు తొలగాయి. తాజాగా హైకోర్టు తీర్పుతో న్యాయపరమైన చిక్కులు తొలగాయ్. ఇక, లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకొనేవాడే లేడని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతీ ఏపీసోడ్ ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’గా తీసుకొస్తున్నారు వర్మ. ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో అనుభవించిన క్షభ, చంద్రబాబు వెన్నుపోటు ఏపీసోడ్, నందమూరి కుటుంబ సభ్యుల వ్యవహార శైలిని ఇందులో చూపించబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు పోషించారు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటించారు. కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. మార్చి 29న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.