ఐపీఎల్‌-12 : ఢిల్లీ క్యాపిటల్స్‌ బోణీ

ఐపీఎల్‌ 12వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. మాజీ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ను దాని సొంతగడ్డపై
ఓడించి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన.. ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ సంచలనం రిషబ్‌ పంత్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ (78 నాటౌట్‌; 27 బంతుల్లో 7×4, 7×6) ఆడాడు. కొలిన్‌ ఇంగ్రామ్‌ (47; 32 బంతుల్లో 7×4, 1×6), శిఖర్‌ ధావన్‌ (43; 36 బంతుల్లో 4×4, 1×6) కూడా రాణించారు.

అనంతరం ముంబయి 19.2 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. యువరాజ్‌ (53; 35 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్‌. క్వింటన్‌ డికాక్‌ (27; 16 బంతుల్లో 4×4, 1×6) మెరుపులు మెరిపించడంతో 3 ఓవర్లకు 28/0తో ముంబయి మంచి స్థితిలోనే నిలిచింది. ఐతే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (14) తర్వాతి ఓవర్లో వెనుదిరగడంతో ముంబయికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పొలార్డ్‌ (21; 13 బంతుల్లో 2×4, 1×6), కృనాల్‌ పాండ్య (32; 15 బంతుల్లో 5×4, 1×6) కాసేపు మెరుపులు మెరిపించినా.. వీరిని ఢిల్లీ బౌలర్లు త్వరగానే పెవిలియన్‌ చేర్చారు. ఇషాంత్‌ (2/34), రబాడ (2/23) ముంబయిని దెబ్బ తీశారు.