ఏపీలో ఐపీఎస్’ల బదిలీల వెనక వైసీపీ


ఎన్నికల వేళ ఏపీలో ఐపీఎస్’లను బదిలీ చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకొంది. ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ తో పాటు, కడప, శ్రీకాకుళం ఎస్పీలని ఈసీ బదిలీ చేసింది. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీని వెనక వైకాపా, బీజేపీల హస్తం ఉందని ఆరోపిస్తోంది. దేశ చరిత్రలోనే ఇంటిలిజెన్స్ డీజీని ఈసీ బదిలీ చేసిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశ రాజకీయాల్లోనూ దీనిపై చర్చ జరిగేలా చేయాలని టీడీపీ భావిస్తోంది. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

వైకాపా ఇచ్చిన ఫిర్యాదులకు మాత్రం ఈసీ రియాక్ట్ కావడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి వివరణ ఇవ్వకుండా ఈసీ బదిలీల నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐపీఎస్ ల బదిలీలపై మంగళవారం రాత్రి టీడీపీ ముఖ్యనేతలతో చర్చలు జరిపారు. ఈ విషయంపై ఎలా స్పందించాలనే దానిపై నేతలకి దిశానిర్ధేశం చేశారు. మొత్తానికి.. ఎన్నికల వేళ ఏపీలో ఐపీఎస్ ల బదిలీ రాజకీయం దుమారం రేపుతోంది.