‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏప్రిల్ 12కు వాయిదా ?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకి లైన్ క్లియర్ అయింది. ఈసీ క్లీన్ చీట్ ఇచ్చింది. సెన్సార్ పూర్తయింది. ఏకంగా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ తెచ్చుకొంది. ఈ వారమే (మార్చి 29)న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాపై మరో ఫిర్యాదు వచ్చింది. ఈ సినిమాని పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 11 వరకు విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని తెదేపా నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు.

తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.బ్రహ్మంచౌదరి మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిశారు. ఎన్నికల నిబంధన ఉన్నప్పుడు ఎలాంటి బయోపిక్‌లను విడుదల చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌అరోడా చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలని ఏప్రిల్ 11 వరకు ఆపాలని వినతి పత్రం అందజేశారు. వీరి విజ్ఝప్తిని ఈసీ పరిగణలోకి తీసుకొంటే మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏప్రిల్ 11 తర్వాతే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.