వివేకా హత్యపై అందరూ నోరు మూసుకోవాల్సిందే !

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎవ్వరు మాట్లాడటానికి వీల్లేదు. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసుని సీబీఐకి అప్పగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసును వచ్చే నెల 15కు వాయిదా వేసింది న్యాయస్థానం. అదే సమయంలో పలు కీలక సూచనలు చేసింది.

ఏప్రిల్‌ 15 వరకు వివేకా హత్యపై రాజకీయ నేతలెవ్వరూ మాట్లాడవద్దని కోర్టు ఆదేశించింది. మాట్లాడబోమని కోర్టుకు అంగీకారపత్రం ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ తన విచారణను కొనసాగించుకోవచ్చని స్పష్టంచేసింది. సిట్‌ అధికారులు సైతం ఈ కేసు వివరాలను బహిర్గతం చేయొద్దని ఆదేశించింది. మొత్తంగా.. వివేకా హత్య కేసుపై ఏపీలో ఎన్నికలు ముగిసేవరకు అందరు నోరు మూసుకోవాల్సిందే.