చంద్రబాబు.. స్టిక్కర్ బాబు అయ్యాడు

ఏపీ సీఎం చంద్రబాబు స్టికర్ బాబు అయ్యాడని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని మోడీ ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలకు తమ స్టిక్కర్‌ అతికించుకుని తమవని చెప్పుకుంటున్నారు. అందుకే సీఎం చంద్రబాబు స్టిక్కర్‌ బాబు అయ్యారు అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రజలని ప్రధాని కొన్ని ప్రశ్నలు వేశారు. మొదటి మంత్రివర్గ సమావేశంలో పోలవరానికి అనుమతులు ఎవరు మంజూరు చేశారు? అనంతపురంలో మొదటి కేంద్రీయ విద్యాలయం ఎవరిచ్చారు? కర్నూలులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌, సోలార్‌ పవర్‌ పార్క్‌ ఎవరిచ్చారు? విశాఖ రైల్వే జోన్‌ ఎవరిచ్చారు? ఏపీ మొదటి ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ ఎవరిచ్చారు? మొదటి గిరిజన విశ్వవిద్యాలయం, విపత్తు నిర్వహణ సంస్థ, ఐఐపీ, ఐఐఎఫ్‌టీ, ఐఐపీ, ఎన్‌ఐఓటీ ఎవరిచ్చారు?. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప విమానాశ్రయాల విస్తరణ ఎవరు చేశారు? మీ కోసం ఈ చౌకీదార్‌ ఇవన్నీ చేశారని ప్రధాని గర్వంగా చెప్పుకొన్నారు.