వెంకీతో సమంత.. వరుస మారిపోయిందేంటీ ?


హీరోయిన్ సమంత వరుస తప్పింది. నాగ్ మామ.. నాగ్ మామ అంటూ ముద్దుగా పిలిచే సమంత.. విక్టరీ వెంకటేష్ ని కూడా వెంకీ మామ అని పిలిచేసింది. వెంకీ నాగ చైతన్యకి మేనమామ. అలాంటప్పుడు సామ్ కి వెంకీ బాబాయ్ వరుస. ఐతే, ఆదివారం జరిగిన ‘మజిలీ’ ప్రీ-రిలీజ్ వేడుకలో నాగ్ మామ, వెంకీ మామ అంటూ పిలిచి సామ్ వరుస తప్పింది. ప్రస్తుతం వెంకీ, చైతూ కలిసి ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బహుశా.. అందుకే సామ్ కూడా వెంకీని వెంకీమామ అని సంబోధించి ఉంటుందేమో !

సమంత-చైతూ భార్యభర్తలుగా నటించిన చిత్రం ‘మజిలీ’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ వారమే (ఏప్రిల్ 5) మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తర్వాత సామ్-చై కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో మజిలీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఈ సినిమాలోని ఏదో ఒక సీన్‌తో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా చైతూ నటన ప్రేక్షకులకి షాక్ ఇచ్చేలా ఉంటుందని చెబుతున్నారు.