‘మహర్షి’ పేరుతో రాజకీయాలు.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయాలకి దూరం. ఆయన సొంత బావ గల్లా జయదేవ్ బరిలో ఉన్నా.. మహేష్ అటు వైపు చూడలేదు. బావకు ఓటేయండీ. గెలిపించండని కనీసం ఓ స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. అయినా.. మహేష్ ని చాలా తెలివిగా వాడుకొంటున్నాడు ఆయన బావ. ఎన్నికల ప్రచారంలో మహేష్ పేరుని ప్రస్తావిస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం సమయంలో తాను గట్టిగా మాట్లాడాను. దానికి ప్రతీకారంగా బీజేపీ.. తనతో పాటు మహేష్ ను టార్గెట్ చేసింది. మహేష్ థియేటర్ ‘ఏఎంబీ’ జీఎస్టీ వివాదం అందుకే వచ్చిందని.. మహేష్ అభిమానుల సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు జయదేవ్. ఇప్పుడు ఏకంగా మహేష్ తాజా చిత్రం ‘మహర్షి’ పేరిట రాజకీయాలు చేస్తున్నారట.

ఒకట్రెండు రోజుల్లోనే గుంటూరులో మహేష్ అభిమానుల ఆత్మీయ సమ్మేళం పేరిట ఓ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మహర్షి పేరుతో ఆహ్వానాలు వెళ్తున్నాయి. ఈ ఆత్మీయ సమావేశం ప్లాన్ చేయడం వెనక మహేష్ బావ సుధీర్ బాబు క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

బావ కోసం తన అభిమానుల మద్దతు కూడగట్టేందుకు మహేష్ వ్యూహాత్మకంగా ఈ సమావేశానికి ప్లాన్ చేశాడా.. ? లేదంటే మహేష్ కి తెలియకుండానే మహేష్, ఆయన తాజా చిత్రం మహర్షి క్రేజ్ ని వాడుకోవడానికి గల్లా జయదేవ్ ప్లాన్ చేశారా.. ? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు, ఇటీవలే దాదాపు 500మహేష్ అభిమానులు వైకాపాలో చేరారు. ఆ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ కూడా జాగ్రత్తపడుతున్నారు. తన అభిమానులని సపోర్ట్ బావకి దక్కేలా చూస్తున్నారని టాక్.