కేసీఆర్’పై పవన్.. చాలా సున్నితంగా !
ఏపీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో కాస్త హద్దులు దాటారు. తెలంగాణలో ఆంద్రోళ్లకి రక్షణ లేదు. అక్కడ వారిని కొడుతున్నారనే కామెంట్స్ చేశారు. అవి వివాదాస్పదం అయ్యాయి. పవన్ కూడా తక్కువోడేం కాదు. ఆయన రెచ్చిగొట్టే రాజకీయాలు మొదలెట్టారనే కామెంట్స్ వినిపించాయి. ఏపీలో తెలంగాణ గురించి అంతలా మాట్లాడిన పవన్ హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో సభలో రెచ్చిపోవడం ఖాయం అనుకొన్నారంతా. కానీ, ఎక్కడ తగ్గాలో పవన్ కి తెలుసు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కలిసి పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ చాలా సున్నితంగా వ్యవహరించడం గమనార్హం. సీఎం కేసీఆర్ ని సూటిగా ప్రశ్నించే సాహాసం చేయలేదు.
ప్రతిపక్షం ఉండకూడదంటే ఎలా అని మోదీ, చంద్రబాబు, కేసీఆర్ను ప్రశ్నించారు. తన ముందే కేసీఆర్ను తిట్టిన నేతలంతా ఇప్పుడు తెరాసలో చేరిపోయారంటూ తలసాని, ఎర్రబెల్లి పేర్లను పవన్ ఉదహరించారు. తెలంగాణ కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. దేశ ప్రధానిగా మాయావతిని చూడాలని ఉందంటూ తన ఆకాంక్షను వెలిబుచ్చారు పవన్.