రివ్యూ : మజిలీ
చిత్రం : మజిలీ (2019)
నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యంశ కౌశిక్ తదితరులు
సంగీతం : గోపి సుందర్, థమన్
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాతలు : హరీష్ పెద్ది, సాహు గారపాటి
రిలీజ్ డేటు : 05 ఏప్రిల్, 2019.
రేటింగ్ : 4/5
పదేళ్ల క్రితమే ప్రేక్షకులని మాయ చేసిన జంట నాగ చైతన్య-సమంత. ‘ఏం మాయ చేశావె’ సినిమాతో ప్రేక్షకులని తొలిసారి మాయ చేశారు. అదేసమయంలో ఒకరి మాయలో మరొకరు పడిపోయారు. సుదీర్ఘకాలంగా ప్రేమించుకొని.. పెళ్లి కూడా చేసుకొన్నారు. ప్రేమలో ఉండగానే ‘మనం’ సినిమాతో రెండోసారి ప్రేక్షకులని మాయ చేశారు. ఇక పెళ్లి తర్వాత చై-సామ్ తొలిసారి జతకట్టిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాతో చై-సామ్ ప్రేక్షకులని మరోసారి మాయ చేశారా.. ? ఇంతకీ.. చై-సామ్ ప్రేమ మజిలీ ఎలా ఉంది ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే కుర్రాడు పూర్ణ (నాగ చైతన్య). క్రికెటర్ కావాలని కలలు కంటుండాడు. టీనేజ్ లో అన్షు (దివ్యాన్ష కౌశిక్)తో ప్రేమలో పడతాడు. ఐతే, అనుకోని పరిణామాల వలన పూర్ణ ప్రేమ విఫలవుతుంది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా శ్రావణి (సమంత) పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లైనా.. పూర్ణ మనసులో అన్షు తాలుకు ప్రేమ జ్ఝాపకాలే ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్న పూర్ణతో శ్రావణి వైవాహిక జీవితం ఎలా సాగింది. భర్త కోసం భార్యపడిన తపన, ప్రేమ.. ఎమోషన్స్ కూడిన కథ మజిలీ.
ప్లస్ పాయింట్స్ :
* కథ-కథనం
* సామ్-చై నటన
* ఎమోషనల్ సీన్స్
* నేపథ్య సంగీతం
* క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
* అక్కడక్కడ స్లో నేరేషన్
ఎలా ఉందంటే ?
పెళ్లికి ముందు ప్రేమనే గొప్పదిగా చూపించే దర్శకులని చూశాం. అలాంటి ప్రేమకథలు తెలుగుతెరపై లెక్కలేనన్నీ వచ్చాయి. ఐతే, పెళ్లి తర్వాత భార్య ప్రేమ గొప్పదనాన్ని చూపించిన దర్శకులు చాలా తక్కువమంది. వీరిలో శివ నిర్వాణ ఒకరు. ‘నిన్నుకోరి’లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన శివ నిర్మాణ.. మరోసారి పెళ్లి తర్వాత ప్రేమకథని ‘మజిలీ’గా చూపించారు. ప్రేమ, పెయిన్ పక్క పక్కనే ఉంటాయని అద్భుతంగా చూపించాడు. బలమైన కథ రాసుకొన్న దర్శకుడు. దాన్ని తెరపై అంతే బలంగా చూపించాడు.
దర్శకుడి కలం బలం కనిపించింది. కొన్ని అద్భుతమైన డైలాగ్స్ వినిపించాయి. ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా కుదిరాయి. వాటిలో చై, సామ్ జీవించేశారు. సెకాంఢాఫ్ లో ఎమోషన్స్ పీక్స్ చేరాయి. క్లైమాక్స్ ని అద్భుతంగా రాసుకొన్నాడు దర్శకుడు. మొత్తంగా.. మజిలీ ఓ ఎమోషనల్ జర్నీ. ఓ అందమైన ప్రేమకథ. ఫస్టాఫ్ ని ఎంటర్ టైనర్ గా మొదలెట్టిన దర్శకుడు మెల్ల మెల్లగా ఎమోషనల్ డోస్ పెంచుతూ వెళ్లాడు. సెకాంఢాప్ లో ఎమోషన్స్ పీక్స్ లో చూపించాడు. అదిరిపోయే క్లైమాక్స్ తో సినిమాని ముగించాడు.
ఎవరెలా చేశారంటే ?
సమంత టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంటుంది. మజిలీలో శ్రావణిగా అద్భుతంగా నటించింది. పెళ్లికి ముందు ప్రేమలో విఫలమై మనసు గాయపడిన భర్తతో సర్థుకుపోయే పాత్రలో ఒదిగిపోయింది.సెకాంఢాప్’లో వచ్చే ఎమోషనల్ సీన్స్ సమంత నటన సినిమాకే హైలైట్. ఇక, చైతూ తన నటనతోప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు.
యాంగ్రీ యాటిట్యూడ్, లవ్ ఫెయిల్యూర్ గా అద్భుతంగా నటించాడు. చై-సామ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగా కుదిరాయి. ఇది కచ్చితంగా నటుడిగా చైతూని ఓ మెట్టు ఎక్కించే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే.. ? విజయ్ దేవరకొండకు ‘అర్జున్ రెడ్డి’, రామ్ చరణ్ కు ‘రంగస్థలం’ ఎలాగో.. చైతూకి ‘మజిలీ’ అలాగా అన్నమాట. ఈ సినిమాతో తనలోని అసలైన టాలెంట్ ని చూపించే అవకాశం చైతూకి దక్కింది. ఇక అన్షు పాత్రకు దివ్యాన్ష పూర్తి న్యాయం చేసింది. రావు రమేష్, పోసానిల నటన బాగుంది.
సాంకేతికంగా :
ఈ సినిమాతో థమన్ పేరు మరోసారి మారిమ్రోగిపోతుంది. నేపథ్య సంగీతంతో మేజిక్ చేశాడు థమన్. ఎమోషనల్ సీన్స్ సరిగ్గా సరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మణిరత్నం సినిమాల రేంజ్ లో నేపథ్య సంగీతాన్ని అందించాడు. గోపీసుందర్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. విష్ణు శర్మ ఫోటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : మజిలీ.. ఓ అందమైన ప్రేమకథ. ఇది యువతకి, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమాలో సామ్-చై నటన అద్భుతంగా ఉంది. ఈ లెక్కన మజిలీ అక్కినేని అభిమానులకి డబుల్ దమాఖా అని చెప్పవచ్చు.
రేటింగ్ : 4/5