లగడపాటి సర్వే : ఏపీలో మళ్లీ అధికారం టీడీపీదే
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఐతే, సర్వేలతో రాజకీయాలని ప్రభావితం చేసే పనిని మాత్రం వదులుకోలేదు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శణానికి తిరుపతి వచ్చిన లగడపాటి.. ఏపీ ఎన్నికలపై స్పందించారు. మరోసారి టీడీపీ అధికారంలోకి రాబోతుందని పరోక్ష ప్రకటన చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు మరోసారి అనుభవజ్ఞులకే పట్టం కడతారు. ఓటేసేముందు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ప్రజలు చూస్తారని చెప్పారు.
మే19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానని లగడపాటి తెలిపారు. ఇప్పటికే పలు జాతీయ ఛానెల్స్ సర్వేలు ఏపీలో వైకాపా అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి. లగడపాటి మాత్రం అందుకు భిన్నంగా మళ్లీ టీడీపీదే విజయం అంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ఛానెల్స్ సర్వేలన్నీ మరోసారి తెరాస దే విజయం అని చెబితే.. లగడపాటి మాత్రం మహాకూటమి గెలబోతుందని చెప్పారు.
ఫైనల్ గా జాతీయచానెల్స్ సర్వేలు నిజమయ్యాయి. ఏపీ విషయంలోనూ జాతీయ ఛానెల్స్ వర్సెస్ లగడపాటి సర్వేలా మారింది. మరోసారి లగడపాటి సర్వే ఫెయిల్ అవ్వనుందా.. ? నిజంగానే వైకాపా అధికారంలోకి రాబోతుందా ? అన్నది చూడాలి.