130 స్థానాల్లో తెదేపా విజయం.. !?
ఏపీలో తెదేపా-వైకాపాల మధ్య ఉత్కంఠ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు ముందు నుంచి చెబుతున్నారు. జాతీయ సర్వేలు మాత్రం విజయం మొగ్గు జగన్ వైపే ఉందని చెప్పాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. గెలుపు మనదే. ప్రజలు మనవైపే నిలిచారని పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ అన్నారు. ఈరోజుతో చంద్రబాబు శని వీడిందని వైకాపా నేతలు కామెంట్ చేశారు. ఐతే, గెలుపుపై జగన్ కంటే చంద్రబాబు ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోంది.
130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదని చంద్రబాబు అన్నారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బాబు అన్నారు. పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకి సూచించారు.