సెహ్వాగ్‌ పొలిటికల్ ఆఫర్

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పొలిటికల్ ఆఫర్ ఒకటి ఇచ్చాడు. రూ.100 కోట్ల ప్యాకేజీ ఇచ్చిన పార్టీలో చేరుతానని ప్రకటన చేశారు. శుక్రవారం గోవా ఫెస్ట్‌లో సెహ్వాగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో చేరతారా ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ‘నేనెప్పుడూ ఒప్పందాలు కుదుర్చుకొని పనిచేస్తా. రంజీల నుంచి ఐపీఎల్‌ వరకు అదే చేశా. ఏ పార్టీ నాతో మంచి ఒప్పందం కుదుర్చుకుంటుందో దాంట్లో చేరతా. అయితే ఆ ఒప్పందం విలువ రూ.100 కోట్లకు తగ్గరాదు’ అని సెహ్వాగ్‌ అన్నారు.

పేరు ప్రస్తావించకుండా కఠిన నిర్ణయాలు తీసుకొనే నాయకుడికే ఓటు వేయాలని సెహ్వాగ్‌ ప్రజలకు పిలుపునిచ్చాడు. నాయకుడికి నిర్ణయాలు తీసుకొనే ధైర్యం ఉండాలి. దేశం, సైనిక, పోలీసు ప్రయోజనాల రీత్యా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. సైన్యాన్ని బలహీనపరిచే వారిని.. ఓ వ్యక్తి స్వప్రయోజనాల కోసమో ఓటు వేయకూడదు. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించేవారికే వేయాలి’ అని సెహ్వాగ్‌ చెప్పాడు.