జగన్ సీఎం, రోజా హోం మినిస్టర్ !

‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టి పెట్టినట్టు’ తయారయ్యాయి ఏపీ రాజకీయాలు. మళ్లీ అధికారం మాదేనని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఏకంగా 130స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని సీఎం చంద్రబాబు అంటున్నారు. ఆ సంఖ్యని రోజు రోజుకి పెంచుతూ పోతున్నాడు. 110 నుంచి 140 స్థానాల్లో గెలుస్తామనే గట్టి ధీమాతో బాబు ఉన్నారు. టీడీపీ సీనియర్ నేతలది ఇదే మాట. సంక్షేమ పథకాలు బాగా పని చేశాయి. అవే మమ్మల్ని గెలిపించబోతున్నాయని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మళ్లీ బాబుగారు సీఎం పక్కా అంటున్నారు. టీడీపీ కంటే వైసీపీ ఫ్యాన్స్ ఇంకా ధీమాతో ఉన్నారు. వందశాతం ఏపీ కాబోయే సీఎం జగన్ అంటున్నారు.

అంతేకాదు.. “వైఎస్ జగన్మోహన్ రెడ్డి – ఆంధ్రపదేష్ ముఖ్యమంత్రి” అంటూ నేమ్ ప్లేట్ ని కూడా రెడీ చేశారు. జగన్ కేబినేట్ ని రెడీ చేస్తున్నారు. వైకాపా వైర్ బ్రాండ్ రోజాని హోం మినిస్టర్ చేశారు. ఆ పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి పెద్ద పదవి ఇచ్చారు. వైకాపా అభిమానుల ధీమాని చూస్తే.. అప్పుడే జగన్ ఏపీ సీఎం అయిపోయాడనే అనిపిస్తోంది. ఇక, వైకాపా రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఏపీకి కాబోయే సీఎం జగన్ అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని ప్రశాంత్ కిషోర్ ఆఫీసుకు జగన్ వెళ్లారు. అక్కడ జగన్ ని ఉద్యోగులకి పరిచయం చేస్తూ.. ఏపీకి కాబోయే సీఎం మన ముందున్నారని సంబోధించారు. దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకోవాలని ఆకాంక్షించారు.

మొత్తంగా.. ఏపీ సీఎం సీటుని అటు తెదేపా, ఇటు వైకాపా నేతలు లాగేసుకొంటున్నారు. వీరి మధ్యలో సీఎం సీటుని పవన్ కల్యాణ్ తన్నుకుపోతాడేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మే 23తో ఏపీ కొత్త సీఎం ఎవరు, దేశానికి కొత్త ప్రధాని ఎవరు? అన్నది తేలనుంది. అప్పటి వరకు జరుగుతున్న ప్రచారాని చూసి.. జనాలు ఎంజాయ్ చేయాల్సిందే.