ఫెయిలైన విద్యార్థుల పేపర్లు రీవాల్యుయేషన్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ వ్యవహారం సీరియస్ గా మారుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేస్తున్నారు. వీరికి ప్రతిపక్ష పార్టీల సపోర్టు లభించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, ఈ వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇందుకు ఎంత సమయం పడుతుందని అదనపు అడ్వొకేట్ జనరల్‌ని ప్రశ్నించింది. సుమారు 2 నెలలు పడుతుందన్న ఆయన వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఫలితాల్లో గందరగోళంపై ఏజెన్సీ పనితీరుపై మాత్రమే ప్రభుత్వం ఆదేశించిందని.. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది దామోదర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరగా.. న్యాయవిచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. దీనిపై సోమవారంలోపు అభిప్రాయాన్ని చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక, ఇంటర్ బోర్డు అధికారుల మధ్య గొడవల కారణంగా అపోహలు పుట్టుకొచ్చాయన్న మంత్రి జగదీశ్వర్ వాఖ్యలపై విద్యార్థులు మండిపడుతున్నారు.