దారుణం : ఇంటర్ బోర్డ్ తెలిసే తప్పు చేసింది

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లడం అపోహా కాదు. నిజమే. ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి అంగీకరించారు. ఫలితాల్లో తప్పులకు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. మరోవైపు, ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రభుత్వ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక రెడీ అయింది. గ్లోబరీనా టెక్నాలజీస్‌ విషయంలో నిబంధనలను తుంగలో తొక్కి ఇంటర్‌బోర్డు అధికారులు వ్యవహరించినట్లు త్రిసభ్య కమిటీ గుర్తించింది. గ్లోబరీనాకు సాంకేతిక అర్హత లేకున్నా దానికే పని అప్పగించారు.

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలను సరిదిద్ది, దానిని మరింతగా అభివృద్ధి చేయకుండా రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ చేపట్టినా ప్రయోజనం ఉండదని కమిటీ తేల్చింది. ఆగస్టు – డిసెంబరు మధ్య ఇంటర్‌ బోర్డు అధికారులు పరీక్ష ఫలితాలకు సంబంధించి టెస్ట్‌రన్‌ నిర్వహించారు. లోపాలను గుర్తించిన అధికారులు దీనివల్ల ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారికి వివరించారు. వారి మాటలను పెడచెవిన పెట్టి గ్లోబరీనాను కొనసాగించడానికే ఇంటర్‌బోర్డు మొగ్గు చూపింది. ఈ నిర్ణయమే 17మంది ఇంటర్ విద్యార్థులని పొట్టబెట్టుకున్నట్టయింది.