తెలంగాణ ఇంటర్ వ్యవహారంపై చంద్రబాబు రియాక్షన్
తెలంగాణ ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గురువారం పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలను కూడా అక్కడి ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోయిందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.
అదేసమయంలో.. సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ఇంటర్ ఫలితాల నేపథ్యంలో అక్కడి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తే… ఎవ్వరూ నోరు మెదపడం లేదు. కానీ తాను ఏపీలో రోజువారీ పాలనలో భాగంగా సమీక్షలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున విమర్శలు చేసే పరిస్థితి ఉందన్నారు. తాను సమీక్షలు చేస్తుంటే నానా యాగీ చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం ఇష్టానునసారంగా వ్యవహరిస్తే పరిపాలన అస్తవ్యస్థంగా మారుతుందన్నారు.
సీఎం కేసీఆర్ సమీక్షల విషయంలో తనయుడు లోకేష్ మాదిరిగా ఏపీ సీఎం చంద్రబాబు పప్పులో కాలేయడం హాట్ టాపిక్ గా మారింది. గత యేడాది ఆఖర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణ పూర్తిస్థాయి సీఎంగా పని చేస్తున్నారు. ఏపీలో మాత్రం చంద్రబాబు ఆపద్దర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఈ విషయం బాబుకు తెలుసు. అయినా.. కేసీఆర్ సమీక్షలని తప్పుబడుతూ.. ఈసీని విమర్శించడం బాబుకే చెల్లిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.