ఆ వివరాలు గోప్యంగా !
ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకి పకడ్బంధీగా ఏర్పాట్లు చేసుకుంటోంది ఎన్నికల సంఘం. ఎన్నికల ఓట్ల లెక్కిపు కోసం 21 వేల మంది వరకూ సిబ్బంది అవసరం అవుతారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
ఆఖరి నిమిషం వరకూ ఎవరు.. ఎక్కడ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారనే విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పారు. సిబ్బంది ఎంపిక తర్వాత రెండు సార్లు ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపడతామని ఆయన వివరించారు. టేబుళ్ల పెంపు కోసం విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నామని చెప్పారు.