ధోనిని మోసం చేసిన ఆమ్రపాలి
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని న్యాయపోరాటానికి రెడీ అయ్యారు. ఆమ్రపాలి సంస్థతో తలెత్తిన వివాదంలో సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నాడు. 2009-2016 మధ్య కాలంలో ఆమ్రపాలి సంస్థకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఐతే, ధోనీకి చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదు. రాంచీలోని అమ్రాపాలి సఫారీలో ధోని ఒక పెంటౌజ్ బుక్ చేసుకున్నాడు. ఆ ఇల్లు విషయంలోనూ ధోనికి యాజమాన్య హక్కులు కల్పించలేదు. అంతేకాదు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ధోని బాధ్యతలను అర్ధాంతరంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అమ్రపాలి సంస్థపై ధోని సుప్రీంకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు.
ఆమ్రపాలి సంస్థపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఆమ్రపాలి వద్ద ఇల్లు కొనుగోలు చేసిన 46 వేల మంది సంస్థ తమను మోసం చేసిందంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆ సంస్థకు చెందిన ఉప సంస్థలు, డైరెక్టర్ల ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యలోనే ఆపేసిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ)ను సుప్రీం కోర్టు జనవరి 25న సూచించింది.