ఐపీఎల్12 : ప్లే ఆఫ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌


ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్‌కు చేరింది. ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఐపీఎల్12లో ప్లే ఆఫ్‌కు చేరిన తొలిజట్టుగా ఢిల్లీ నిలిచింది. 12 మ్యాచుల్లో ఎనిమిది మ్యాచ్ లని ఢిల్లీ గెలిచింది. ఇక బెంగళూరు 12 మ్యాచుల్లో ఎనిమిది మ్యాచులు ఓడిపోవడంతో ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపు కోల్పోయింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. శిఖర్‌ ధావన్‌ (50; 37 బంతుల్లో 5 x4, 2×6), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (52; 37 బంతుల్లో 2×4, 3×6) రాణించారు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌ (28; 13 బంతుల్లో 1×4, 3×6), అక్షర్‌పటేల్‌ (16; 9 బంతుల్లో 3×4) చెలరేగి ఆడటంతో ఆ జట్టు స్కోరు187 చేరింది.

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 171 పరుగులకే పరిమితమైంది. పార్థివ్‌పటేల్‌(39; 20 బంతుల్లో 7×4, 1×6), విరాట్‌కోహ్లీ(23; 17 బంతుల్లో 2×4, 1×6) శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 63 పరుగులు జతచేశారు. ఆరు ఓవర్లకు 64/1తో పటిష్ఠస్థితిలో ఉన్న బెంగళూరు జట్టు కోహ్లీ ఔటయ్యాక.. పేకమేడల కూలింది. ఢిల్లీ బౌలర్లలో రబాడా, అమిత్‌మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టగా ఇషాంత్‌శర్మ, అక్షర్‌పటేల్‌, రూథర్‌ఫోర్డ్‌ తలో వికెట్‌ తీశారు.