రాహుల్ భారతీయుడుగా.. నిరూపించుకోవాల్సిందే !
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారతీయుడు కాదు. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నోటీసులు కేంద్ర హోంశాఖ రాహుల్ కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వాస్తవాలేంటో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
‘డా.సుబ్రహ్మణ్య స్వామి నుంచి అందుకున్న ఫిర్యాదు మేరకు మేం మీకు(రాహుల్) ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం. బ్యాకప్స్ లిమిటెడ్ పేరిట యునైటెడ్ కింగ్‌డమ్‌లో రిజిస్టరైన కంపెనీలో మీరూ ఒక డైరెక్టరుగా కంపెనీ నమోదు కోసం సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారని ఆయన హోంశాఖ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే 10/10/2005 నుంచి 31/10/2006 మధ్య కంపెనీ వార్షిక రిటర్నుల్లో మీ పుట్టిన తేదీ 19/06/1970 అని.. మీ జాతీయత బ్రిటిష్‌గా పేర్కొన్నారని ఫిర్యాదులో తెలిపారు. కంపెనీ మూసివేత కోసం చేసుకున్న దరఖాస్తులోనూ మీ జాతీయతను బ్రిటిష్‌గా తెలిపినట్లు వివరించారు’’ అని హోంమంత్రిత్వ శాఖ పౌరసత్వ విభాగం డైరెక్టర్ బీసీ జోషీ రాహుల్‌కు రాసిన లేఖలో వివరించారు. ఈ నోటీసులపై రాహుల్ స్పందించాల్సి ఉంది.