కేసీఆర్ ఇమేజ్’ని డ్యామేజ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇది సోషల్ మీడియా యుగం. ఎవడికి నచ్చింది వాడు రాసుకోవచ్చు. అది క్షణాల్లో వైరల్ అవుతుంది కూడా. ఐతే, శృతి మించితేనే అసలు సమస్య. ఇలా సీఎం కేసీఆర్, ఆయన కూతురు, ఎంపీ కవితలపై అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆరెస్ట్ చేశారు. సీఎం ప్రతిష్ఠకు భంగం కలిగేలా, ఆయన కుమార్తె కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానాలు ఉన్నాయంటూ తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం కేసీఆర్, కవితలను ఉద్దేశించి రెండు ఫేస్‌బుక్ ఖాతాల్లో అసభ్య వాఖ్యలున్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్ నిర్వాహకులను సంప్రదించి ఐపీ చిరునామాలు తీసుకున్నారు. వీటి ఆధారంగా పరిశోధించగా.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్‌లో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి చిప్రా నరేష్ ఇదంతా చేస్తున్నాడని గుర్తించారు. మంగళవారం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎవరైనా సోషల్ మీడియాలో శృతిమించితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.