నూటికి వెయ్యి శాతం టీడీపీదే అధికారం
ఏపీ అసెంబ్లీ ఫలితం మే23న వెలువడనున్న సంగతి తెలిసిందే. ఐతే, కౌంటింగ్ కు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ.. గెలుపుపై సీఎం చంద్రబాబుతో ధీమా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. నూటికి వెయ్యి శాతం మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో రెండో ఆలోచనే లేదు. మెజార్టీ ఎంతనేదే తేలాల్సి ఉందన్నారు. గురువారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్ధులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు ఇందులో పాల్గొన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో అన్ని నివేదికలూ పరిశీలించి చెబుతున్నానని, మళ్లీ ప్రభుత్వం మనదేనని పునరుద్ఘాటించారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సలహాలు, సూచనలు చేశారు.
మరోవైపు, గెలుపుపై వైసీపీ ధీమాగానే కనిపిస్తోంది. మే 23 తర్వాత చంద్రబాబుకు రిటైర్డ్మెంట్ తప్పదు. ఏపీకి కాబోయే సీఎం జగన్ అని వైకాపా అభిమానులు చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి జగన్ అంటూ నేమ్ ప్లేట్స్ ని కూడా రెడీ చేసుకొన్నారు. జాతీయ సర్వేలు సైతం ఏపీలో వైకాపా అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఒక్క లగడపాటి మాత్రమే ఏపీలో మళ్లీ టీడీపీదే అధికారం అంటున్నారు. ఆయన సర్వేని ఆధారంగానే సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ అయింది. మరీ.. ఏపీలో ఆయన సర్వే ఏ మేరకు నిజం అవుతుందన్నది చూడాలి.