ఫణి ఎఫెక్ట్ : 12గంటలు డేంజర్


ఫణి ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని, గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను ఈశాన్య దిశగా పయనిస్తూ ఒడిషా తీరంవైపు దూసుకెళ్తోంది. రేపు ఉదయం 10 గంటలకు పూరీ తీరం వద్ద ఫణి తుఫాను తీరం దాటనుంది. ఈ సాయంత్రం 7 గంటల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫణి ప్రభావం 12గంటల పాటు ఉండని చెబుతున్నారు.

కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవులలో 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. అలాగే విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 8వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రేపు ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధాన రహదారులను మూసివేస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని , శ్రీకాకుళం ఉత్తర, తీర ప్రాంత మండలాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.