ఉత్కంఠ పోరులో.. ఢిల్లీదే గెలుపు !


ఐపీఎల్12 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయింది. విశాఖ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ రెండు వికెట్ల తేడాతో హైదరాబాద్ పై గెలుపొందింది. శుక్రవారం (మే10) ఢిల్లీ-చెన్నై జట్ల మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలుపొందిన జట్టు.. ముంబైతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. గప్తిల్‌ (38; 19 బంతుల్లో, 1×4, 4×6), మనీశ్‌ పాండే (30; 36 బంతుల్లో, 3×4), కెప్టెన్‌ విలియమ్సన్‌ (28; 27 బంతుల్లో 2×4), విజయ్‌శంకర్‌ (25; 11 బంతుల్లో 2×4, 2×6), మహ్మద్‌ నబీ (20; 13 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. దిల్లీలో జట్టులో కీమో పాల్‌ 3, ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీశారు. అమిత్‌ మిశ్రాకు ఒక వికెట్‌ దక్కింది.

163పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 10ఓవర్లలో (83/1) అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత సన్ రైజర్స్ పుంజుకొంది. ఖలీల్ అహమ్మద్ వేసిన 11ఓవర్ లో రెండు వికెట్లు పడ్డాయి. మంచి ఊపుమీదున్న పృధ్వీ షా (56)తో పాటు ఢిల్లీ కెప్టెన్ శ్రీయస్ అయ్యర్ (8)ని అవుట్ చేశాదు ఖలీల్. ఇక, 14ఓవర్ లోనూ రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మున్రో (14), అక్షర్ పటేల్ (0) అవుట్ చేశాడు.ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 49 (21బంతుల్లో 2*4, 5*6) బ్యాటింగ్ హైలైట్. విజయానికి 5పరుగులు అవసరం ఉన్నసమయంలో రిషబ్ అవుటయ్యాడు. ఆ వెంటనే మరో వికెట్ పడటంతో ఢిల్లీ గెలుపుపై ఉత్కంఠగా మారింది.

ఆఖరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి కిమో పాల్ ఫోర్ కొట్టి జట్టుని గెలిపించాడు. ఢిల్లీ జట్టు సెమీ ఫైనల్ కి చేరుకోవడం ఇదే తొలిసారి.