రివ్యూ : మహర్షి
చిత్రం : మహర్షి (2019)
నటీనటులు : మహేష్ బాబు, పూజ హెగ్డే, అల్లరి నరేష్, జగపతిబాబు తదితరులు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
కథ : వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిర్మాత : దిల్ రాజు, సి. అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి
రిలీజ్ డేటు : 09మే, 2019
కమర్షియల్ హిట్ కొడితే.. ఆ కిక్కే వేరు. ఐతే, సామాజిక నేపథ్యం ఉన్న కథతో కమర్షియల్ హిట్ కొడితే.. డబుల్ కిక్కు దొరికినట్టే. శ్రీమంతుడు, భరత్ అనే నేను అనే సినిమాలతో ఆ కిక్కుని ఎంజాయ్ చేశాడు సూపర్ స్టార్ మహేష్. ఆయన 25వ సినిమా కోసం అదే ఫార్మెట్ లో వెళ్లి.. ‘మహర్షి’గా మారాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల మధ్య ‘మహర్షి’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. రిషి జర్నీ ఎలా సాగింది? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది?? తెలుసుకొనేందుకు మహర్షి రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
రిషి కుమార్ (మహేష్ బాబు) ఓడిపోవడం అంటే ఏమిటో తెలియని బిజినెస్ మేన్. ఓ కంపెనీ సీఈఓ. ఓ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఐతే, తన జీవితం, తన విజయాలు తనొక్కడి కష్టానికి వచ్చిన ప్రతిఫలాలు కాదని, వాటి వెనుక తన ఇద్దరి స్నేహితుల (పూజా హెగ్డే, అల్లరి నరేష్) కష్టం, త్యాగం కూడా ఉన్నాయని గ్రహిస్తాడు. మరి ఆ స్నేహితుల కోసం రిషి ఏం చేశాడు ? విజయం అంటే డబ్బు సాధించడమే, స్థాయిని పెంచుకోవడమే అనుకునే రిషి.. అసలుసిసలైన విజయాన్ని ఎలా గుర్తించాడు ? మహర్షిగా ఎలా మారాడు ? అనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
* కథ
* మహేష్ బాబు, అల్లరి నరేష్
* ఫస్టాఫ్
* నేపథ్య సంగీతం
* నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాఫ్ లో సాగదీత
* రన్ టైం
* కొన్ని సినిమాలతో పోలిక అనిపించడం
సినిమా ఎలాసాగింది.. ?
దర్శకుడు వంశీ పైడిపల్లి బలమైన కథని ఎంచుకున్నాడు. తాను అనుకున్న విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందుకు మహేష్‌లాంటి అగ్రకథానాయకుడి ఎంచుకోవడం వల్లే ఈ కథకు మరింత బలం చేకూరింది. రిషి ప్రయాణంలో రెండు కీలక వ్యవస్థలని ప్రశ్నించే ప్రయత్నంచే చేశాడు దర్శకుడు. విద్యావ్యవస్థపై వ్యంగ్య బాణాలు సంధించాడు. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతుల దీనస్థితిని కళ్లకు కట్టారు. అదే సమయంలో పక్కా కమర్షియల్ కొలతల్లో కథని చెప్పే ప్రయత్నం చేశాడు.
తొలి సగంలో విద్యావ్యవస్థని ప్రశ్నించిన రిషి – ద్వితీయార్ధంలో రైతు సమస్యలపై పోరాటం చేస్తాడు. కాలేజీ సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. స్నేహం, ప్రేమలాంటి ఎమోషన్స్ పండిస్తూనే విద్యా వ్యవస్థ తీరు తెన్నులను ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ఐతే, సెకాఢాఫ్ లో స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టింది. కథకు కీలకం అనుకున్న మహేష్ – నరేష్ ఎపిసోడ్లో ఎమోషన్స్ ఇంకాస్త బాగా పండాల్సింది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉన్నా.. ఓ కథని నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం అభినందించదిగిన విషయమే.
ఎవరెలా చేశారంటే ?
రిషి పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయి. ఒక్కో షేడ్‌లో మహేష్ ఒక్కోలా కనిపిస్తాడు. సీఈఓగా స్టైలిష్‌గా కనిపించిన మహేష్, విద్యార్థిగా యూత్, క్లాస్ ని అలరిస్తాడు. సెకాంఢాఫ్ లో మాత్రం మాస్ ఆకట్టుకొన్నాడు. మహేష్ ని బిజినెస్ మేన్ గా పరిచయం చేసి.. వెంటనే కాలేజీ ఏపీసోడ్ లోకి తీసుకెళ్లాడు. సెకాంఢాఫ్ లో మహేష్ రైతు సమస్యలపై పోరాట సన్నివేశాలు వస్తాయి. మహేష్ ఎనర్జి, టైమింగ్, లుక్స్ అదిరిపోయాయి. మహేష్ తెరపై మరింత అందంగా కనిపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మహేష్ వన్ మేన్ షో.
అల్లరి నరేష్ కథకి మూలస్తంభంగా నిలిచాడు. ‘గమ్యం’లో గాలిశీను పాత్రలా ఇది ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. కాలేజీ ఏపీసోడ్ లో మహేష్, నరేష్, పూజా హెగ్డే పాత్రలకి సరిగ్గా సరిపోయారు. కాలేజ్ ఏపీసోడ్ ఏకంగా 45నిమిషాల పాటు సాగినా.. బోర్ కొట్టదు. ఇంకొచెం సేపు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పూజాహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది. ఆమెను కేవలం గ్లామర్‌కే పరిమితం చేయలేదు. కథానుసారం ఆ పాత్రకూ ప్రాధాన్యం ఇచ్చారు. కాలేజ్ సన్నివేశాల్లో చిలిపితనంతో ఆకట్టుకున్న పూజా పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది. జగపతిబాబు మరోసారి స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నారు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.
సాంకేతికంగా :
కె.యు మోహనన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్యం సంగీతంలో మేజిక్ చేశాడు దేవి. ఇంచుమించుగా మూడు గంటల నిడివి ఉన్న సినిమా ఇది. సన్నివేశాల్ని కుదించుకునే వీలున్నా.. ఆ దిశగా చిత్రబృందం ఆలోచించలేదు. అది సినిమాకే పెద్ద మైనస్ అయింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
చివరగా : మహర్షి.. మహేష్ అభిమానులు కాలరెగిరేసే సినిమా
రేటింగ్ : 3.5/5