సార్వత్రిక ఎన్నికలు ఒక్కరోజులో నిర్వహించలేరా ?
దేశంలో సార్వత్రిక ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం క్రిందా మీదా పడుతోంది. కొన్ని చోట్ల రీపోలింగ్ అనివార్యం అవుతోంది. ఐతే, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాత్రం సార్వత్రిక ఎన్నికలని ఒక్కరోజులో నిర్వహించలేరా.. ? లక్షల మంది సైన్యం, రక్షక దళాలు ఉంటేగానీ సార్వత్రిక ఎన్నికలు జరగవనే భ్రమలను కల్పిస్తుండటంతో ప్రజాస్వామ్యం హాస్యాస్పదంగా మారిందింది అంటున్నారు.
లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై బృంద చర్చ జరిగింది. ఈ చర్చలో జేపీతో పాటు మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ, భాజపా నేత విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొని సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని తీర్మానించారు. కెన్యా లాంటి దేశంలో ఒకేరోజులో అన్ని ఎన్నికలూ నిర్వహించి ఆ రోజు రాత్రే ఫలితాలు ప్రకటించాయి. చిన్న చిన్న దేశాలు ఒక్క రోజులో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ఇస్తూ ఉంటే ఇక్కడ రూ.వేల కోట్లు ఖర్చుచేసి నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంచడం వల్ల దేశాభివృద్ధి ఆగిపోతోందని జేపీ ఆందోళన వ్యక్తంచేశారు.