ఏడేళ్లయిన పవర్ తగ్గలేదు


గెలిచినప్పుడు మన పవర్ ఏంటన్నది పూర్తి స్థాయిలో తెలీదు. వరుగా ఓటమిలు, ఎదురు దెబ్బల అనంతరం కూడా గెలిచి నిలబడినప్పుడు మాత్రమే మన పవర్ ఏంటన్నది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో పూర్తి స్థాయిలో చూపించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. మే11 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. అంతకుమించి.. పదకొండేళ్ల పవన్ ఫ్యాన్స్ దాహాన్ని పూర్తి స్థాయిలో తీర్చిన చిత్రమిది. పవన్ ఫ్యాన్స్ కాలరెగిరేసేలా చేసిన చిత్రమిది

1997లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్. తొలి సినిమాతోనే తనని తాను కొత్త ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నించారు. రెండో సినిమా ‘తొలి ప్రేమ’ (1998) సూపర్ హిట్. అంతేకాదు.. యూత్ లో పవన్ కి విపరీతమైన ఫ్యాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘తమ్ముడు’, బద్రీ, ఖుషి సినిమాలతో పవన్ యూత్ ఐకాన్ గా మారాడు. ఐతే, పవన్ చేసిన సినిమాలు ఆయన రేంజ్ కి తగ్గట్టుగా ఆడలేదు. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, పులి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. జల్సా, తీన్ మార్ సినిమాలు మాత్రం ఓ మోస్తరుగా ఆడాయి. దీంతో పవన్ అభిమానులు తలెత్తుకోలేని పరిస్థితి.

2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్-శృతిహాసన్ జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పవన్ అభిమానులకి విందు భోజనం పెట్టింది. తిరిగి పవన్ నిలబెట్టింది. టాలీవుడ్ కి రూ. 100కోట్ల పునాదిని వేసింది. గబ్బర్ సింగ్ విడులైన శనివారానికి (మే11) ఏడేళ్లు. ఇప్పటికీ ఆ సినిమా తాలుకు తీపి జ్ఝాపకాలు గుర్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్, ఇండస్ట్రీ ప్రముఖులు, పవన్ అభిమానులు గబ్బర్ సింగ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకొంటున్నారు. ఏడేళ్లయిన గబ్బర్ సింగ్ పవర్ తగ్గలేదన్న మాటా.