ఏపీ కేబినేట్ భేటీ : ఆ నాలుగు అంశాలపై కీలక నిర్ణయాలు
ఈసీ అనుమతితో బుధవారం ఏపీ కేబినేట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఈసీఐ అనుమతించిన నాలుగు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఫొని తీవ్ర తుపానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు.
ఫొని తుపాను నష్టపరిహారం అంచనాపై కేబినేట్ భేటీలో చర్చ జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తదుపరి అంచనాలపై సర్వే జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎంకు వివరించినట్టు సమాచారం. రాయలసీమ జిల్లాల్లో తాగునీటి ఎద్దడిపై చర్చ జరిగింది.