మల్లన్న సాగర్‌ ఆపే ప్రసక్తే

తెలంగాణ ప్రభుత్వానికి తీపి కబురు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. నిర్వాసితుల పిటిషన్‌పై గురువారం విచారించిన ఉన్నత న్యాయస్థానం పరిహారం తీసుకోవాలని వారికి సూచించింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని పేర్కొంది. ఈ మేరకు పరిహారం తీసుకోని చెక్కులను 46 మంది నిర్వాసితుల తరఫు న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది. కోర్టు తీర్పుతో మల్లన్న సాగర్ నిర్మాణానికి పూర్తిగా అడ్డంకులు తొలగినట్టయింది.

కాళేశ్వరం దాని అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి హైకోర్టులో 175కు పైగా పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ కలిపి విచారించాలంటూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టు స్పందించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన అన్ని పిటిషన్లనూ కలిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం స్పష్టంచేసింది.