ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో నోటిఫికేషన్‌ ఇవ్వొద్దు : హైకోర్టు

రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డిల మండలి సభ్యత్వం రద్దు వ్యవహారంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు, ఇతర రికార్డులు సమర్పించి.. వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు న్యాయస్థానాన్ని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం.. ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో జూన్ 3 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు విషయంలోనూ హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. మల్లన్న సాగర్ ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. నిర్వాసితుల పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం పరిహారం తీసుకోవాలని వారికి సూచించింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని పేర్కొంది. ఈ మేరకు పరిహారం తీసుకోని చెక్కులను 46 మంది నిర్వాసితుల తరఫు న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది. కోర్టు తీర్పుతో మల్లన్న సాగర్ నిర్మాణానికి పూర్తిగా అడ్డంకులు తొలగినట్టయింది.