రేషన్ డీలర్లతో ప్రభుత్వం చర్చలు ఫలించాయా..
నవంబర్ 1 నుంచి సమ్మె చేస్తామంటూ చేసిన రేషన్ డీలర్ల ప్రకటనకు ప్రభుత్వం దిగివచ్చింది. సమ్మె ప్రకటన తరువాత రేషన్ డీలర్ల అసోసియేషన్ తో చర్చించేందుకు మంత్రి ఈటేల వారితో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటలపాటు వారితో చర్చించి వారి డిమాండ్లను తెలుసుకున్నారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కిరిస్తామని మంత్రి ఈటెల హామీ ఇచ్చారు. ఇప్పటికే పదకొండు వేల మంది డీలర్లు రేషన్ కోసం డీడీలు తీసుకున్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. చర్చలు సఫలమయ్యాయని, రేషన్ డీలర్ల సమ్మె ఉండదని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతానికి సమ్మెపై వెనక్కి తగ్గినా, సమస్యలు పరిష్కారం కాకపోతే తిరిగి సమ్మె బాట తప్పదని రేషన్ డీలర్లు చెబుతున్నారు.