సాధ్వీ ప్రజ్ఞా వ్యాఖ్యలపై మోదీ రియాక్షన్
నాథూరం గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి, భాజపా నాయకురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడ్డారు. బాపూను అవమానించిన ఆమెను ఎప్పటికీ క్షమించబోనని అన్నారు.
మరోవైపు, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పై చర్యలు తీసుకొనేందుకు భాజాపా అధిష్టానం సిద్ధమవుతోంది. ప్రజ్ఞా వ్యాఖ్యలు భాజపా సిద్ధాంతాలకు విరుద్ధమని, అది ఆమె సొంత అభిప్రాయం మాత్రమేనని అన్నారు. ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ డిసిప్లనరీ కమిటీకి సూచించినట్లు తెలిపారు.
‘స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది హిందువే, ఆయన పేరు నాథూరామ్ గాడ్సే’ అని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం చెలరేగింది. కమల్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని ప్ర్రజ్ఞాసింగ్‌ను ఓ విలేకరి అడగగా.. ‘నాథూరాం గాడ్సే గొప్ప దేశ భక్తుడు. అతన్ని ఉగ్రవాది అనేవాళ్లు పునరాలోచించుకోవాలి. ఈ ఎన్నికల్లో అలాంటివారికి దీటైన జవాబు చెప్పాలి’ అని అన్నారు.