ప్రధానికి ఇన్నాళ్లకి కుదిరింది.. !


ప్రధాని నరేంద్ర మోడీకి మీడియా ముందుకు రావడానికి ఐదేళ్ల సమయం పట్టింది. శుక్రవారం ఢిల్లీలోని భాజాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి ప్రధాని మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో మోదీ మీడియా సమావేశంలో మాట్లాడటం ఇదే తొలిసారి. ఐదేళ్లు దేశానికి సేవ చేసే అవకాశమిచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రజాస్వామ్యం ఎంతో విలువైనదని, దీంతో ప్రపంచాన్నే మెప్పించామన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో భాజాపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. భాజాపా అధ్యక్షుడిగా అమిత్‌షా మీడియా సమావేశం నిర్వహించారనీ, ప్రధాని హోదాలో విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వలేనని చెప్పారు. ఈ సందర్భంగా.. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే గొప్పదేశభక్తుడంటూ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ స్పందించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామని, ఆమెని ఎన్నటికి క్షమించలేనని అన్నారు.