నటుడు రాళ్లపల్లి కన్నుమూత
ప్రముఖ హాస్యనటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాళ్లపల్లి తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒకరు చాన్నాళ్ల క్రిందటే మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో కూతురు అమెరికాలో ఉంటున్నారు. ఆమె వచ్చిన తర్వాత రాళ్లపల్లి అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్ 10న జన్మించిన రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1979లో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్ 1 విడుదల, సూర్య, ఐపీఎస్, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరాకాండ, భలే భలే మగాడివోయ్ తదితర చిత్రాల్లో నటించారు.
మొత్తం రాళ్లపతి 850కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన ఇండస్ట్రీలో చాలా మందికి సాయం చేసినట్టు తెలుస్తోంది. నటుడు తనికెళ్ల భరణి రాళ్లపల్లి సొంత తండ్రిగా భావిస్తుంటారు. రాళ్లపల్లి మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రాళ్లపల్లి పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి మోతీనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనం కోసం రాళ్లపల్లి మృతదేహాన్ని ఉంచనున్నారు.