‘లక్ష్మీబాంబ్‌’పై లారెన్స్ ఆవేదన


దర్శకుడు రాఘవా లారెన్స్‌ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ‘కాంచన’ బాలీవుడ్ రిమేక్ ని ‘లక్ష్మీబాంబ్’గా తెరకెక్కుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక. ఇందులో బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐతే, ఈ సినిమా నుంచి లారెన్స్ సడెన్ గా తప్పుకొన్నారు. తాజాగా, దీనిపై లారెన్స్ వివరణ ఇచ్చారు.

ఇటీవల ‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే, లారెన్స్ అనుమతి లేకుండా ఫస్ట్ లుక్ వదిలారట. దీంతో మనస్థాపానికి గురైన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ‘నాతో చర్చించకుండా ఫస్ట్‌లుక్‌ ఎలా విడుదల చేస్తారు? ఓ దర్శకుడిగా అది నన్ను చాలా బాధించింది. దీనిపై ఇప్పటికీ నాకు చిత్రవర్గం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ ఘటనతో నేనో మూర్ఖుడిలా ఫీలయ్యేలా చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే, తనకు అక్షయ్‌తో ఎలాంటి సమస్యలు లేవని తెలిపాడు. కేవలం అక్షయ్ కోసమే తన స్క్రిప్టుని వెనక్కి తీసుకోలేదని వివరణ ఇచ్చారు లారెన్స్. 2020లో లక్ష్మీ బాంబు విడుదల కానుంది.