ఆ రెండు స్థానాలపై వైకాపా న్యాయపోరాటం

ఏపీలో వైకాపా ఏకంగా 22 ఎంపీ స్థానాలని గెలుచుకొంది. ఐతే, మరో రెండు స్థానాలు కూడా గెలుచుకోవాల్సి ఉందని.. ఆ పార్టీ నేతలు అంటున్నారు. గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వైకాపా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో) సరిగా వ్యవహరించలేదని వైకాపా భావిస్తోంది. ఈ రెండు స్థానాలపై హైకోర్టుని ఆశ్రయించాలని యోచిస్తోంది. సోమవారం జగన్‌తో గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల అభ్యర్థులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.

గుంటూరులో తెదేపా అభ్యర్థి సుమారు 4వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ప్రకటించారని.. పోస్టల్‌ బ్యాలెట్ల అంశంపై అక్కడి రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మోదుగుల ఆరోపిస్తున్నారు. అక్కడ పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల సంఖ్య దాదాపు 9వేలకు పైనే ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం స్థానంలో తెదేపా అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడు 6వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతోనే గెలుపొందినట్లు ప్రకటించారని, అక్కడ కూడా సర్వీసు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే అన్యాయం జరిగిందని నేతలు జగన్‌కు వివరించారు. దీంతో ఆ రెండు స్థానాలపై వైకాపా న్యాయపోరాటానికి రెడీ అవుతోంది.