ఇంటర్ రీ-వాల్యూయేషన్’లో 1,137మంది ఉత్తీర్ణత

ఇంటర్‌ పునఃలెక్కింపు, పరిశీలనల ఫలితాలు వచ్చేశాయి. అప్పుడు తప్పి, ఇప్పుడు ఉత్తీర్ణులైన విద్యార్థులు 1,137 మంది. దీన్ని బట్టి సాంకేతిక తప్పులతోపాటు మూల్యాంకనంలోనూ అలవిమాలిన నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు స్పష్టమవుతోంది. మార్చి పరీక్షలకు హాజరైన వారు 9,43,005 మంది. ఉత్తీర్ణులైన వారు 5,60,889 మంది. తప్పిన విద్యార్థుల సంఖ్య 3,82,116 మంది. పునఃపరిశీలన చేసిన జవాబుపత్రాల సంఖ్య 9,02,429మంది.

ఇంటర్‌ ఫలితాల ప్రాసెసింగ్‌ సంస్థ, ఇంటర్‌బోర్డుల నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్‌ 18వ తేదీన విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షల ఫలితాల్లో అధిక సంఖ్యలో సాంకేతిక పొరపాట్లు దొర్లడంతో వేలాది మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటర్‌బోర్డు వద్ద ఆందోళనకు దిగడం తెలిసిందే. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది.