సాహో నుంచి సంగీత త్రయం.. అందుకే తప్పుకొంది !
సాహోకి తొలి దెబ్బ తగిలింది. ఈ సినిమా నుంచి సంగీత త్రయం తప్పుకొంది. సాహో చిత్రానికి శంకర్ – ఎహసాన్ – లాయ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురూ ఈ టీమ్ నుంచి బయటకు వచ్చేశారు. ‘మా అభిమానులందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. సాహోకు సంగీతం అందించడం లేదు. ఆ సినిమా నుంచి తప్పుకున్నాం’ అని సంగీత త్రయం
ప్రకటించింది. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారమ్.
శంకర్ – ఎహ్‌సాన్ -లాయ్… బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. ఐతే, దక్షిణాది నాడి మాత్రం వీళ్లకు అంతగా తెలీదు. ఇక్కడి స్టైల్, మాసిజం పసిగట్టలేకపోయాయి. వీళ్ల పాటల్లో వెస్ట్రన్ ఛాయలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. అవి తెలుగు ప్రేక్షకులు ఎక్కే ఛాన్సులు చాలా తక్కువ. సరిగ్గా ఇక్కడే సుజీత్ కీ ఈ సంగీత త్రయానికీ మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది.
సంగీత త్రయం ఇచ్చిన ట్యూన్లు.. సుజిత్‌కి నచ్చకపోవడం, మార్పులూ చేర్పులూ చెప్పినా – ఆట్యూనులు మారకపోవడంతో సుజిత్ బాగా ఇబ్బంది పడ్డాడట. `ఇన్నిసార్లు మార్చమంటే మావల్ల కాదు` అనే టైపులో శంకర్ – ఎహ్ సాన్ – లాయ్‌లు విసుకున్నారని సమాచారం. సాహో సినిమాకు సంబంధించి 5 పాటల కంపోజింగ్ పూర్తయింది. వీటిలో 2 పాటల్ని చిత్రీకరించారు కూడా. ఇక ఓ యాక్షన్ ఎపిసోడ్ కు వీళ్లు రీ-రికార్డింగ్ కూడా ఇచ్చారు. ఇలా దాదాపు 70శాతం పని పూర్తయిన తర్వాత సంగీత త్రయం తప్పుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. వీరి స్థానం థమన్ లేదా గిబ్రాన్ ని తీసుకొనే ఛాన్స్ ఉందని సమాచారమ్.