ఈ ఐదేళ్ల కాలం ఎంతో ఘనం

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేళ్ల కాలం చిన్న కాలం. ఐతే, మనం సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ ఐదేళ్ల కాలం ఎంతో ఘనమన్నారు. శాంతిని, సామరస్యాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోంది. మొక్కవోని దీక్షతో అభ్యుదయపథంలో సాగుతోందన్నారు.

కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా వారి జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేసినట్లు సీఎం చెప్పారు. ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ కాలంలో విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ సఫలం అవుతోందన్నారు. పెంచిన పింఛన్లు జులై నుంచి అమలు చేస్తాం. కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన ఆశీస్సులే ప్రభుత్వానికి పెట్టని కోటలు అన్నారు. మిషన్ కాకతీయ అంతర్జాతీయ ప్రశంసలు పొందిందన్నారు సీఎం కేసీఆర్.