ఏపీ భవనాలు తెలంగాణ చేతికి.. !
హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ భవనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం చెరి సగం కేటాయించింది. ఏపీ ప్రభుత్వం అమరావతి నుంచి పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో, ఉద్యోగులు కూడా అక్కడి వెలగపూడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఏపీ భవనాల విద్యుత్ ఛార్జీలని ఎవరు చెల్లిస్తారనే విషయంలో వివాదం నెలకొంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు టీడీపీ ప్రభుత్వం చొరవ చూపలేదు.
ఐతే, ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మారింది. విభజన హామీలని సామరస్యంగా పరిష్కరించుకొందామని ముఖ్యమంత్రులిద్దరు నిర్ణయం తీసుకొన్నారు. కేంద్రం జోక్యం లేకుండా ఆరు నెలల్లో సమస్యలన్నీ పరిష్కరించుకొందామని అనుకొన్నారు. ఆ దిశగా మొదటి అడుగుపడింది. హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం వాడుకోని భవనాలని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఏపీ సీఎం జగన్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఆ భవనాలని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ.. తాజాగా గవర్నర్ నరసింహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.