రివ్యూ : హిప్పీ

చిత్రం : హిప్పీ (2019)

నటీనటులు : కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బాసింగ్‌, వెన్నెల కిశోర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు

సంగీతం : నివాస్‌ కే ప్రసన్న

దర్శకత్వం : టీఎన్‌ కృష్ణ

నిర్మాణ సంస్థ : వీ క్రియేషన్స్‌

రిలీజ్ డేట్ : 06జూన్, 2019.

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు కార్తీకేయ. ఈ సినిమా తర్వాత ఆయనకి బోలేడు ఆఫర్లు క్యూ కట్టాయి. వాటిలో హిప్పీ కథని ఎంచుకొన్నాడు కార్తీకేయ. ఈ చిత్రానికి టీఎన్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. దిగంగన సూర్యవన్షీ, శ్రద్దాదాస్ హీరోయిన్లు. జేడీ చక్రవర్తి ఇందులో కీలక పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు. టైటిల్‌, పోస్టర్‌, టీజర్‌తోనే ఇది కూడా ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రమే అనిపించింది. మరీ.. హిప్పీ ఆ రేంజ్ హిట్ ని అందుకొందా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.

కథ :

దేవదాస్ అలియాస్ హిప్పి (కార్తీకేయ) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపే ర‌కం. ఆముక్త మాల్యద (దిగంగ‌న సూర్యవంశీ)తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తుంటాడు. ఆమె చుట్టూ తిరిగేంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె తిరిగి ప్రేమించ‌డం మొద‌లు పెడుతుందో అప్పట్నుంచి త‌న స్వేచ్ఛని కోల్పోయిన‌ట్టుగా భావిస్తాడు హిప్పీ. మ‌రి వీరి ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వెళ్లిందా? లేదా? వీరి ప్రేమ‌క‌థ‌ని హిప్పీ బాస్ అయిన అర‌వింద్ (జేడీ చ‌క్రవ‌ర్తి) ఎలాంటి మ‌లుపు తిప్పాడు? అనేది కథ.

ప్లస్ పాయింట్స్ :

* కార్తీకేయ నటన

* దిగంగ‌న గ్లామర్

* నేప‌థ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* కథ‌, క‌థ‌నం

* కామెడీ

* డబుల్ మీనింగ్ డైలాగ్స్

* క్లైమాక్స్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

మ‌నం ప్రేమిస్తే ఆ అనుభూతి స్వర్గంలోకి వెళ్లిన‌ట్టుగా ఉంటుంది. తిరిగి మ‌న‌ల్ని ప్రేమిస్తే స్వర్గం కోల్పోయిన‌ట్టుగా ఉంటుందనే అంశం చుట్టూ అల్లిన క‌థ ఇది. కథ కంటే కథనంపైనే దర్శకుడు దృష్టి సారించారు. సన్నివేశాలను క్లాస్ అండ్ రొమాన్స్ టచ్‌తో స్క్రిన్‌పైన ఎలివేట్ చేసిన విధానం ట్రెండీగా ఉంది. సోషల్ మీడియా జనరేషన్‌కు కావాల్సిన మసాలలు దట్టించి రాసుకొన్న స్క్రిన్ ప్లేలో అక్కడక్కడ కొంత తడబాటు కనిపించినా.. మొత్తంగా ప్రేక్షకుడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

కార్తికేయ న‌ట‌న హుషారుగా సాగుతుంది. ‘ఆర్‌ఎక్స్‌100’లో చేసిన పాత్రకి భిన్నంగా మ‌రింత ఉత్సాహంగా క‌నిపించాడు. హిప్పీ పాత్రలో చ‌క్కగా ఒదిగిపోయాడు. కాక‌పోతే కార్తికేయ సిక్స్‌ప్యాక్‌ దేహాన్ని చూపించడంపైనే మ‌రీ ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టున్నారు ద‌ర్శకుడు. అవ‌స‌రం లేని చోట కూడా చొక్కా విప్పించారు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో ‘ఆర్ఎక్స్‌100’ని మ‌రోసారి గుర్తు చేశాడు.

దిగంగ‌న అందం, న‌ట‌న చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. ఆమె ప్రతీ స‌న్నివేశంలో అందంగా క‌నిపించారు. ద్వితీయార్ధంలో ఆమె న‌ట‌న కూడా మెప్పిస్తుంది. బాస్ అర‌వింద్ పాత్రలో జేడీ చ‌క్రవ‌ర్తి ఒదిగిపోయారు. తెలంగాణ యాస మాట్లాడుతూ ఆయ‌న పండించిన హాస్యం మెప్పిస్తుంది. జ‌జ్బాసింగ్‌, శ్రద్ధా దాస్ చిన్న పాత్రల్లో మెరిశారు. వెన్నెల‌ కిషోర్ పాత్రతో పెద్దగా హాస్యం పండ‌లేదు.

సాంకేతికంగా :

సాంకేతికంగా సినిమా ఫర్వాలేద‌నిపిస్తుంది. నివాస్ కె.ప్రస‌న్న స‌మ‌కూర్చిన బాణీల కంటే నేప‌థ్య సంగీతం బాగుంది. రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన బ‌లం. ప్రవీణ్ ద్వితీయార్ధంలో త‌న కత్తెర‌కి మ‌రింత ప‌దును పెట్టాల్సింది. క‌థ‌నం ప‌రంగా ద‌ర్శకుడి ప‌నిత‌నం అక్కడక్కడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

చివరగా : హిప్పీ.. ఈ తరం దేవదాస్ కథ

రేటింగ్ : 2.75/5