జగన్ మొదటి మూడు సంతకాలు పెట్టిన ఫైళ్లు.. ఇవే !

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం.. ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. మూడు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. ఆశా వర్కర్ల వేతనం రూ.10వేలకు పెంపు దస్త్రంపై మొదటి సంతకం, అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి ఏపీ నుంచి అంగీకారపత్రంపై రెండో సంతకం, జర్నలిస్టుల సమగ్ర బీమా దస్త్రంపై మూడో సంతకం చేశారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

“అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి ధృడ సంకల్పంతో ఉన్నాం. అధికారులు తమకున్న పూర్తి అవగాహనతో సహకరించాలి. మీరు పూర్తిగా సహకరిస్తే ప్రజలు, ప్రభుత్వం కల నెరవేరుతుంది. మీపై నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. అనవసర వ్యయాన్ని తగ్గించాలి. మంచి పనితీరు కనబరిచే అధికారులను సత్కారాలతో గౌరవిస్తాం. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలి. గతంలో కాంట్రాక్టులు అంటే కేవలం తమకు అనువైన వారికే ఉండేవి. ఇక ఆ పరిస్థితి తలెత్తకుండా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తాం” అని సీఎం అన్నారు.