అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ సింగ్‌ గుడ్ బై

టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించారు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పాడు. క్రికెట్‌ కోసం తన రక్తం, స్వేదం ధారపోశానన్నాడు.

తన తదుపరి లక్ష్యం క్యాన్సర్‌ బాధితులకు సాయం అందించడమేనని ప్రకటించాడు. జీవితంలో తనపై తాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదని తెలిపాడు. తనకు పోరాడటం, పడటం.. లేవడం ముందుకు సాగడం క్రికెట్ నేర్పిందన్నారు యువీ. 2011 వన్డే ప్రపంచకప్‌, 2007 టీ20 ప్రపంచకప్‌ విజయంలోనూ యువరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. ఐపీఎల్ లో ఆడటంపై యువీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.