‘మల్లేశం’ గొప్పగా ఉన్నాడు : కేటీఆర్
హాస్యనటుడు ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం కథ ఇది. పోచంపల్లికి చెందిన మల్లేశం చేనేత వస్త్రాలను సులభంగా నేయడానికి యంత్రాన్ని కనుగొన్నారు. ఈ చిత్రానికి రాజ్ ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్క్ కే రోబిన్ సంగీతం అందిస్తున్నారు. ఝాన్సీ, అనన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 21న ‘మల్లేశం’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ‘మల్లేశం’ని ప్రదర్శించారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మల్లేశం’ ప్రీవ్యూని చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మల్లేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ఎంతో మానవీయంగా, హృద్యంగా ఉందని కొనియాడారు. ‘‘అంతరించిపోతున్న చేనేత కళకు ‘మల్లేశం’ చిత్రం జీవం పోసింది. నవీన ఆవిష్కరణల రూపకల్పనలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది. చేనేత కార్మికుల సమస్యలు ఇంకా తీరిపోలేదు. మల్లేశం ఆసు యంత్రం తయారు చేసి.. ఎంతో మంది తల్లులకు ఉపశమనం కల్పించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి బాగా నటించారు. మాటల రచయిత పెద్దింటి అశోక్.. అజ్ఞాత సూర్యుడు. ‘మల్లేశం’ చిత్రానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం ఉంటుంది’’ అన్నారు కేటీఆర్.